బంగారంకు ధర ఎవరు, ఎలా నిర్ణయిస్తారో తెలుసా?
బంగారం అంటే ఇష్టంపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అలాగే బంగారంపై మోజు ఆడవారితోపాటు మగవారు కూడా ఎక్కువే. ఇక శుభకార్యాల సమయంలో అయితే బంగారు ఆభరణాలు ధగధగలు మెరిసిపోవాల్సిందే. ఆ టాపిక్ లు రావాల్సిందే. మన ఒంటిమీద ఉన్న బంగారన్నే బట్టే చాలా మంది మన స్టేటస్ ఏమిటనేది కూడా అంచనా వేస్తూంటారు. బంగారం ఒంటినిండా ఉన్న వాళ్లు పంక్షన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తూంటారు. అందుకే బంగారం అంటే చాలా మందికి మోజు. అందుకే మనవాళ్లంతా బంగారం ధరలు ఏమన్నా తగ్గాయా? గ్రాముకి ఎంత తగ్గింది? ఇప్పుడు కొనుగోలు చేయాలా? మరికొన్ని రోజులు ఆగితే మంచిదా? ఇవాళ బంగారం ధర ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలు తరచూ వేస్తూనే ఉంటారు…ఎంక్వైరీలు చేస్తూనే ఉంటారు. అయితే మనలో చాలా మందికి ఓ పెద్ద డౌట్ ఎప్పటినుంచో పీకుతూంటుంది… బంగారం ధరల్ని ఎలా,ఎవరు నిర్ణయిస్తారు…ధర షాపు, షాపుకు ఎందుకు మారుతుంది? అని.. నిజానికి .. బంగారం ధర,మనం చేయించుకునే లేదా కొనుక్కునే ఆభరణంలో ఉన్న బంగారు శాతం, అందులో ఏ లోహం కలిపాము అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాదు బంగారం దిగుమతులు, రూపాయి విలువ పడిపోవటం-బలపడటం, కరెన్సీ మారకం విలువల ప్రభావం తదితర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతుంది.
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకం విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. మనం బంగారాన్ని డాలర్ల రూపంలో కొనుగోలు చేస్తాం. అదే డాలర్ విలువ తగ్గితే బంగారం తగ్గుతుంది. వర్తకులు ఎక్కడ నుంచి బంగారం కొన్నారు, ఎంతకు కొన్నారు లాంటి అంశాలు కూడా ధరను నిర్ణయిస్తాయి. అందుకే షాపుకు, షాపుకు ధరలు మారిపోయేది. అంతేకాదు ప్రతీ సిటీలోనూ షాపు యజమానులందరికీ కలిపి ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘం ప్రతిరోజూ ఉదయం సమావేశమై బిల్లింగ్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే .. కొందరు వర్తకులు, ఈ రోజు బంగారం ధర ఎంత అనేది షాప్ బయట బోర్డు పెడతారు.