బంగారంతోనే కాదు…బంగారం లాంటి మనస్సుతోనూ ‘అక్షయ తృతీయ’

అక్షయం అంటే నాశం లేకపోవడం.దినదినాభివృద్ది చెందడం కూడా. ఈ రోజు బంగారాన్ని కొంటే అక్షయమౌతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయనాడు నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అక్షయమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ‘ అక్షయ ‘ తృతీయగా వ్యవహరిస్తారు. హిందూ పురాణాల్లో అక్షయపాత్ర ప్రసక్తి వస్తుంది. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాల్లో ఉంటుంది. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం వుంటే చాలు జీవితంలో ఏ లోటు వుండదని చెప్పబడుతోంది. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనది భావిస్తారు. అక్షయ తృతీయరోజే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. నాలుగు యగాల్లో మొదటిది కృత యగం. ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పంటలు పండే రోజులవి! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట! నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే! కాబట్టే అక్షయ తృతీయ నాడు…రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.